భువనేశ్వర్: ఒక పంచాయతీ అధికారి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. పలు బ్యాంకు ఖాతాల్లోని ప్రభుత్వ నిధుల్లో 43 లక్షలకు పైగా విత్‌డ్రా చేశాడు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ కోసం ఆ డబ్బును వినియోగించాడు. (Panchayat officer arrested) ఈ మోసం గురించి తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాధాదేయ్పూర్ గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పీఈవో) ఖేత్రమోహన్ నాయక్ భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. 2024 జూలైలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు.
కాగా, ఖేత్రమోహన్ నాయక్ తన పదవిని దుర్వినియోగం చేశాడు. ఆ గ్రామ సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. కేంద్ర ప్రాయోజిత నిధులు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, వృద్ధాప్య పెన్షన్ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ బ్యాంకు ఖాతాల నుంచి రూ.43.01 లక్షల నిధులను చెక్కుల ద్వారా విత్ డ్రా చేశాడు. సొంత అవసరాలతోపాటు ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ కోసం ఆ డబ్బును వినియోగించాడు.
మరోవైపు ఆ ఆర్థిక మోసాన్ని గుర్తించడంతో బెర్హంపూర్ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పీఈవో) ఖేత్రమోహన్ నాయక్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు, ఆర్థిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పంచాయతీ అధికారి ఆర్థిక మోసాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.