Terrorist killed | ఎల్ఓసీ వెంట చొరబాటు ప్రయత్నాలు భారత సైన్యం తిప్పికొట్టింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు. బత్తల్ సెక్టార్లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తుండగా ల్యాండ్ మైన్ పేలిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒకరు ల్యాండ్‌మైన్‌పై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు తమ వెంట ఐఈడీని తీసుకురాగా.. అది కూడా పేలిందని.. దాంతో మరింత నష్టం జరిగిందని సైన్యం వర్గాలు చెప్పాయి. ఉగ్రవాద చొరబాట్లను నియంత్రించేందుకు భారత సైన్యం ఎల్ఓసీ ప్రాంతంలో ల్యాండ్మైన్లను అమర్చింది. ఈ సీజన్లో తక్కువ హిమపాతం నేపథ్యంలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారు. దాంతో భద్రతా బలగాలు, భారత సైన్యం.. కశ్మీర్లో నిఘాను పెంచింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్లో ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. చొరబాట్లను అరికట్టాలన్నారు.