Attari-Wagah Border | న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దు వద్ద తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేయగా, దానికి డెడ్లైన్ కూడా ముగిసింది. అయితే ఈ సరిహద్దు వద్ద డజన్ల కొద్దీ పాకిస్థాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగానే పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు తమ కౌంటర్లను మూసివేసింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. దీంతో డజన్ల కొద్దీ పాక్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు.
దీంతో తాము అసలు ఏ దేశానికి చెందిన వారిమో తెలియక మహిళలు, వృద్ధులు, పిల్లలు తలదాచుకునే ప్రదేశం కూడా లేక, ఆకలితో అల్లాడారు. పాకిస్థాన్ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమ సొంత పౌరులను దేశంలోకి రానీయకపోవడమేమిటని వారు మండిపడుతున్నారు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది.