Pakistan | న్యూఢిల్లీ, మే 4: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడికి దిగితే తగిన రీతిలో జవాబిస్తామంటూ ఒక పక్క పాకిస్థాన్ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతతో ఇబ్బంది పడుతున్నది. యుద్ధమంటూ మొదలైతే నాలుగు రోజుల్లో శతఘ్ని గుండ్లు ఖాళీ అవుతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు జరిగిన నేపథ్యంలో ముందస్తు ఒప్పందాల మేరకు పాకిస్థాన్ తన దగ్గర ఉన్న ఆయుధ సామగ్రిలో చాలామటుకు ఈ రెండు దేశాలకు ఎగుమతి చేసేయడంతో నిల్వలు తరిగిపోయాయి. తీరా ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో సొంతానికి వినియోగించుకునేందుకు ఫిరంగి మందుగుండు సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడింది.
సైన్యానికి ఆయుధాలను సరఫరా చేసే పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కాలం చెల్లిన ఉత్పత్తి సౌకర్యాల మధ్య పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆయుధ సామగ్రిని తయారు చేయడానికి ఆపసోపాలు పడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయడానికి చాలాకాలం పడుతుందని అవి పేర్కొంటున్నాయి. ‘హఠాత్తుగా ఇప్పుడు భారత్‌తో యుద్ధం ప్రారంభమైతే తమ వద్ద ఉన్న మందుగుండు సామగ్రి నిల్వలు కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయి’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. భారత సైనిక చర్యను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ సైన్యం వద్ద ఎం109 హోవిట్జర్లకు తగినంత 155 ఎంఎం షెల్స్, లేదా దాని బీఎం 21 వ్యవస్థలకు 122 ఎంఎం రాకెట్లు లేవు. 155 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ఉక్రెయిన్‌కు విక్రయించడంతో ఇప్పుడు వాటి నిల్వలు చాలా స్వల్పంగా ఉన్నాయని ఏప్రిల్‌లో చేసిన పలు ఎక్స్ పోస్టుల ద్వారా వెల్లడైంది.
ప్రస్తుతం భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన క్రమంలో భారత్ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అంటూ పాకిస్థాన్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని మే 2న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఒక వేళ భారత్‌తో యుద్ధం వచ్చి అది దీర్ఘకాలం కొనసాగితే ఒక పక్క మందుగుండు సామగ్రి కొరత, మరోపక్క తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ చాలా చిక్కులు ఎదుర్కోక తప్పదని పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా అభిప్రాయపడ్డారు.
భారత్‌తో యుద్ధం మొదలైతే ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే.. ‘ఏం చేస్తాం.. ఇంగ్లండ్ పారిపోతా’ అంటూ పాకిస్థాన్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మర్వత్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడైన మర్వత్ను భారత్‌తో యుద్ధం మొదలైతే తుపాకీ పట్టుకుని బోర్డర్‌కు వెళ్తారా? అని మీడియా ప్రశ్నించగా, ‘లేదు భారత్‌తో యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్ పారిపోతా’ అని ఎంపీ సమాధానం చెప్పారు. ఒక వేళ ఉద్రిక్తతలు సడలడానికి మోదీ తగ్గాలని మీరు భావిస్తున్నారా? అనగా, ‘మోదీ ఏమన్నా మా అత్త కొడుకా, నేను చెబితే ఆగడానికి?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో పాకిస్థాన్ ఆర్మీ శక్తిని ఆ దేశ ఎంపీలు కూడా నమ్మడం లేదని పలువురు వ్యాఖ్యానించారు. అంతకుముందు మర్వత్ ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ సభ్యుడిగా ఉండేవారు. అయితే పార్టీ నాయకత్వాన్ని తరచూ విమర్శిస్తుండటంతో ఆయనను పార్టీ కీలక పదవుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తొలగించారు.
పాకిస్థాన్ నౌకలు తమ దేశ పోర్టుల్లోకి రాకుండా వాటి ప్రవేశంపై నిషేధం విధిస్తూ భారత్ విధించిన ఆంక్షలకు స్పందనగా పాకిస్థాన్ సైతం అదే తరహా నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి హడావిడిగా ఆ దేశ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌కు చెందిన నౌకలు తమ నౌకాశ్రయాలలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని, అదే సమయంలో పాకిస్థాన్ నౌకలేవి భారత ఓడ రేవులలోకి అడుగుపెట్టవని తెలిపింది. సముద్ర సార్వభౌమత్వాన్ని, దేశ ఆర్థిక ప్రయోజనాలు, జాతి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపింది.