న్యూఢిల్లీ: యుద్ధం అంటూ వస్తే భారత్ అంతు తేలుస్తామని డాంబికాలు పలికిన పాకిస్థాన్.. భారత్‌తో రెండు రోజుల ఘర్షణకే చేతులెత్తేసింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడంతో రుణాల కోసం దేబిరిస్తోంది. పొరుగుదేశం ఇండియా కారణంగా కలిగిన భారీ నష్టం నేపథ్యంలో అంతర్జాతీయ భాగస్వాములు మరిన్ని రుణాలిచ్చి తమను ఆదుకోవాలంటూ పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘ఎక్స్’ వేదికగా అభ్యర్థించింది.
ఈ పోస్టు కాస్తా వైరల్ కావడంతో గంటలోనే ప్రభుత్వం స్పందించింది. తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని, అంతర్జాతీయ రుణాల కోసం తాము ఎలాంటి ట్వీట్ చేయలేదంటూ మంత్రిత్వశాఖ ప్రతినిధులు ‘రాయిటర్స్’కు తెలిపారు. ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీని స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసిన పాకిస్థాన్ సమాచార, ప్రసారశాఖ దానిని ‘ఫేక్’గా కొట్టిపడేసింది.
రుణాల కోసం పాక్ చేసిన అభ్యర్థన పోస్టు, మళ్లీ ‘ఫేక్’ అంటూ చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఫ్యాక్ట్ చెకర్ ‘పీఐబీ’ కూడా దీనిపై మీమ్ పోస్ట్ చేసింది. ‘యాచించేందుకు ఇదో మార్గమా?’ అని ఎద్దేవా చేసింది.