న్యూఢిల్లీ: ఆర్థిక, రాజకీయ అస్థిరత, పరిమితమైన అవకాశాల ఫలితంగా మేధావుల వలసను పాకిస్థాన్ తీవ్రంగా ఎదుర్కొంటోంది. గడచిన రెండేండ్లలో వేలాది మంది డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశం విడిచి పెట్టి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మొట్టమొదటి ప్రవాస పాకిస్థానీయుల వార్షిక సదస్సులో పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ విదేశాలలో నివసిస్తున్న పాక్ పౌరులు ప్రపంచ రాయబారుల పాత్రను పోషిస్తున్నారని, ఇది మేధో వలస కాదని, మేధో లాభమని చెప్పుకొచ్చారు.ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ లెక్కల ప్రకారం 2024, 2025 మధ్య 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు పాక్‌ను వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో పాక్ ఆరోగ్య విభాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కథనంపై స్పందించిన మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటే ముందుగా రాజకీయ అస్థిరతను చక్కదిద్దాల్సి ఉంటుందని అన్నారు.