ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలం మూసివేతను జూన్ 24 వరకు పాకిస్థాన్ పొడిగించింది. (Pak Extends Closure Of Airspace) పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) ఈ మేరకు కొత్తగా నోటమ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. ‘పాకిస్థాన్ గగనతలం వినియోగించే భారత విమానాలపై నిషేధాన్ని 2025 జూన్ 24 ఉదయం 4:59 గంటల వరకు పొడిగించాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో నమోదై నిర్వహిస్తున్న, లేదా లీజుకు తీసుకున్న అన్ని విమానాలు ఈ నిషేధానికి లోబడి ఉంటాయని పేర్కొంది. భారత విమానయాన సంస్థలు లేదా ఆపరేటర్లు నిర్వహించే ఏ విమానం కూడా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించడానికి అనుమతించబోమని పీఏఏ తెలిపింది. భారత సైనిక విమానాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారత్ తీసుకున్న చర్యల తర్వాత పాకిస్థాన్ గత నెలలో భారతదేశానికి తన గగనతలాన్ని నిషేధించింది. మే 23తో ఈ గడువు ముగియడంతో తాజాగా జూన్ 24 వరకు పొడిగించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) నిబంధనల ప్రకారం ఒకేసారి ఒక నెల రోజుల పాటు గగనతలం మూసివేతను పరిమితం చేయవచ్చు.