శ్రీనగర్: భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజూ కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో తేలికపాటి ఆయుధాలతో చీకటి మాటులో క్రమం తప్పకుండా కాల్పులు జరుపుతున్నది. సోమవారం రాత్రి అక్నూర్ సెక్టార్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని సరిహద్దుల్లో భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ తుపాకులతో విరుకుపడింది. అయితే పాక్ దుశ్చర్యను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ సైనికులకు దీటుగా భారత బలగాలు స్పందించాయని అధికారులు వెల్లడించారు.
కాగా, ఆదివారం రాత్రి కూడా సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది. అయితే పాక్ కాల్పులను భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ‘ఆదివారం అర్ధరాత్రి వేళ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి దాడులను తిప్పికొట్టాయి. రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్ కాల్పులు జరిపింది.’ అని భారత సైన్యం వెల్లడించింది. ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతున్నది. అయితే పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.