న్యూఢిల్లీ, ఆగస్టు 12: పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా గడ్డపై నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో ఎటువంటి సైనిక ఘర్షణలు జరిగినా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని క్షిపణులతో పేల్చివేస్తామని మునీర్ తాజా హెచ్చరికలు చేశారు.
భారత్‌కు చెందిన కీలకమైన చమురు రిఫైనరీపై దాడి చేస్తామని పాకిస్థానీ సైన్యాధిపతి హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఫ్లోరిడాలోని తాపాలో ఓ ప్రైవేట్ విందు సమావేశంలో ఆదివారం రాత్రి మునీర్ ప్రసంగిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ ఫొటోతో ఉన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించారు. భారత్‌తో భవిష్యత్తులో యుద్ధం జరిగితే అణ్వస్ర్తాన్ని ప్రయోగించక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ఈ బెదిరింపులను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం సింధూ లోయ నాగరికత, సంస్కృతిపై దాడిగా పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అభివర్ణించారు. యుద్ధానికి భారత్ ప్రేరేపిస్తే తాము వెనుకడుగు వేయబోమని, తలవంచబోమని ఈ పవిత్ర ప్రదేశం నుంచి మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపుతున్నానని ఆయన చెప్పారు.