న్యూఢిల్లీ, మే 4: పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్‌పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్థాయి శక్తులను వినియోగించి ఇస్లామాబాద్ ప్రతిఘటనకు దిగుతుందని మహమ్మద్ ఖలీద్ జమాలి హెచ్చరించారు. రష్యాకు చెందిన ఆర్టీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘భారత దేశ ఉన్మాద మీడియా, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు మమ్మల్ని ఆ దిశగా బలవంతం చేశాయి.
పాక్‌లోని కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని భారత్ నిర్ణయించినట్టు కొన్ని లీకైన డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది. కాబట్టి ఇది జరగబోతున్నదని, ఇది ఆసన్నమైందని మేము భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. అదే పరిస్థితి ఏర్పడితే తాము సంఖ్యాబలం గురించి ఆలోచించమని, తమ సంప్రదాయ, అణు శక్తి రెండింటినీ పూర్తి స్థాయిలో వినియోగిస్తామని ఆయన తెలిపారు. ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్న పాకిస్థాన్ ఆర్మీ అన్నింటికీ సన్నద్ధమై ఉందని ఆయన చెప్పారు.