న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) చేపట్టిన ఈ సైనిక చర్యలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై రెండేసి సార్లు దాడులు జరిగాయి. భారత వైమానిక దళంతో పాటు, నేవీ, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వైమానిక దళం ఎయిర్ టు ల్యాండ్ క్షిపణులను ప్రయోగించింది. అదే సమయంలో ఆర్మీ కూడా భూమి నుంచి భూమిపైకి ప్రయోగించే క్షిపణులను లాంచ్ చేసింది. దీంతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో లక్ష్యంగా చేసుకున్న 9 ఉగ్రవాద కేంద్రాలను ఇలా రెండు రకాల క్షిపణులు ధ్వంసం చేశాయి. 25 మిస్సైల్స్, ప్రధానంగా స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ అనే ప్రెసిషన్ గైడెడ్ బాంబులను వినియోగించినట్లు తెలుస్తున్నది.
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’ దాడిలో పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలపై భారత దళాలు దాడి చేశాయి. సవాయి నల్ల, సర్జల్, ముర్దికే, కోట్లి, కోట్లి గుల్పూర్, మెహమూనా జోయా, భీంబర్, బహవల్పూర్ వరకు దక్షిణాన ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో సుమారు వంద మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.