Poonch : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్ జిల్లా (Poonch district) లో నియంత్రణ రేఖ (Line of Control) వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక పాకిస్థానీని ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
సోమవారం కూడా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డ ఒక పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే తాజాగా మరో పాకిస్థానీ భారత్‌లో చొరబడ్డాడు. ఇదిలావుంటే ఏప్రిల్ 23న ఒక బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు.
సరిహద్దుల్లో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలకు రక్షణగా వెళ్లిన జవాన్ పొరపాటున ఫెన్సింగ్ దాటి వెళ్లడంతో పాక్ రేంజర్స్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విడిపించేందుకు సంప్రతింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జవాన్లు బార్డర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ ఉన్నతాధికారులు సూచించారు. పొరపాటున కూడా అవతలివైపు అడుగుపెట్టవద్దని చెప్పారు.