Pakistan | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తూ వారిని సైనిక శిబిరాలలోకి, బంకర్లలోకి పాక్ ప్రభుత్వం తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత భద్రతా సంస్థలు అనేక ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంతో పాక్ వెంటనే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం మొదలు పెట్టినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పీవోకే వ్యాప్తంగా సర్దీ, దూద్నియల్, అత్మూగం, జురా, లిపా, బచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కోట్లి, ఖైరట్టా, మంధర్, నికాయిల్, చమన్కోట్, జన్కోటే తదితర ప్రదేశాలలో ఉన్న స్థావరాలలో తలదాచుకున్న ఉగ్రవాదులను సైనిక శిబిరాలలోకి, బంకర్లలోకి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది.