న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: భవిష్యత్‌లో భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని, ప్రతి దాడులను ఆ ప్రాంతం వరకు తీసుకుని వెళ్తామని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రేలాపనలు చేశారు. తన స్వస్థలం సియాల్కోట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా కొంతమంది మృతదేహాలను పడేసి, వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా భారత్ బూటకపు ఆపరేషన్ రూపొందించినట్టు నివేదికలు ఉన్నాయని ఆరోపించారు. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఖవాజా ఇప్పటికే తన అక్కసు వెళ్లగక్కారు.