Noida Protests : వేతనాల పెంపు కోరుతూ ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనల వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. దీని వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కార్మికుల ఆందోళనలు హింసాత్మకంగా మారడం వెనుకు పాకిస్తాన్ కుట్ర ఉండొచ్చని యూపీ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్బహర్ అన్నారు. ఈ ఘటనల్ని ప్రణాళికాబద్దంగా జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
ఈ విషయాన్ని పోలీసులు తేలుస్తారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే ఈ ఘటనలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల నోయిడాలోని మీరట్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు అరెస్టైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ హింస వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ముందుగా కొందరు కార్మికులు వారం రోజుల క్రితం.. ఫ్యాక్టరీల్లో వేతనాల పెంపు కోరుతూ నిరసన చేపట్టారు. తర్వాత ఈ నిరసనలు వీధుల్లోకి మారాయి. వేల మంది కార్మికులు నిరసనల్లో చేరారు. తర్వాత మరింత ఆందోళనకరంగా మారాయి.
పోలీసులపైకి రాళ్లు రువ్వడం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడం, ఫ్యాక్టరీల్ని ధ్వంసం చేయడం, వాహనాల దహనం వంటి ఘటనలు జరిగాయి. అయితే, ఈ ఘటనలు ఉన్నట్లుండి జరిగినవి కావని, వీటి వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు తేల్చారు. ఆందోళనకారులు ఈ ఘటనలకు మూడు రోజుల ముందు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని చాటింగ్, ఆడియో కాల్స్ చేసుకున్నట్లు గుర్తించారు. అందరినీ సమీకరించడం, నిరసనలు తెలపడం వంటి వాటిపై చర్చించుకున్నారు. ఈ డిజిటల్ ఎవిడెన్స్ను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. అలాగే, ఇన్స్టాగ్రామ్లో కూడా చాటింగ్ చేసుకున్నట్లు గుర్తించారు. అందులో ఏకంగా మరుసటి రోజు పోలీసులపై ఎలా దాడి చేయాలో కూడా చర్చించారు. పోలీసులపై దాడి చేసేందుకు కారం కూడా తీసుకురావాలని చర్చించుకున్నారు.
పోలీసుల దాడుల్లో తమవాళ్లు గాయపడ్డారని, అందుకు బదులుగా మరిన్ని నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో కొందరు మాస్కులు ధరించి పాల్గొనడం కూడా చర్చనీయాంశంగా మారింది. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కార్మికులతో సంబంధం లేని వారు ఈ ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు దాదాపు 400 మందిని అరెస్టు చేశారు. 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.