Nitin Gadkari | ఈ20 (E20) బ్లెండింగ్ పెట్రోల్‌కు వ్యతిరేకంగా తనను రాజకీయంగా లక్ష్యం చేసుకునేందుకు సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తుందని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వార్షిక సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ20 బ్లెండింగ్ పెట్రోల్ విమర్శలపై నితిన్ గడ్కరీ ఎదురుదాడి చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌పై అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వంటి సంస్థలు పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌పై తమ పరిశోధనలను పంచుకున్నాయని గడ్కరీ తెలిపారు.
‘మీ పరిశ్రమ పనిచేసే విధానం తరహాలోనే రాజకీయాలు కూడా పనిచేస్తాయి. సోషల్ మీడియా పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఇది నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునేందుకే. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రతీది స్పష్టంగా ఉంది. ఇథనాల్ మిశ్రమం అనేది దిగుమతికి ప్రత్యామ్నాయం. కాలుష్య రహితమైంది. స్వదేశీ’ అని గడ్కరీ తెలిపారు. భారత్ శిలాజ ఇంధనాల దిగుమతిపై భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తుందని గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి, ఆదా చేసిన మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించడం మంచి చర్య కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘మక్కజొన్న నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తాం. ఈ చర్య రైతులకు రూ.45వేల కోట్ల ప్రయోజనం చేకూర్చింది’ అని పేర్కొన్నారు.