Siddaramaiah | బెంగళూరు, ఏప్రిల్ 27 : పహల్గాం దాడిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్‌తో యుద్ధానికి భారత్ తొందరపడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం మైసూర్లో ఆయన మాట్లాడుతూ, ‘పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదు. మేం యుద్ధానికి అనుకూలం కాదు. శాంతి నెలకొనాలి. ప్రజలు సురక్షితంగా ఉన్నామని భావించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యాలను తప్పుబట్టారు. ఆయన కామెంట్స్‌ను పాకిస్థాన్ మీడియా సైతం ప్రముఖంగా ప్రస్తావించింది. జియో న్యూస్ సహా పాక్‌కు చెందిన వివిధ న్యూస్ చానల్స్ ఆయన వ్యాఖ్యల్ని ప్రసారం చేశాయి. ‘ఇండియాలోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన గళం వ్యక్తమవుతున్నది’ అని పాక్ మీడియా పేర్కొన్నది. దీంతో ఈ వ్యవహారంపై ఆదివారం సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘వెంటనే యుద్ధం వద్దన్నా. అంతేగానీ.. పూర్తిగా వద్దనలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.
సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ మండిపడింది. పాకిస్థాన్ రత్నగా సిద్ధరామయ్య మాట్లాడుతున్నారని విపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్ అశోక ఎద్దేవా చేశారు. జాతీయ భద్రతకు సంబంధించి ఎలా మాట్లాడాలో కూడా సిద్ధరామయ్యకు తెలియకపోవటం కర్ణాటక దురదృష్టమని, శత్రువుకు మేలు చేసేలా మాట్లాడారని విమర్శించారు.
ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన నాటి నుంచి అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రశ్నల వల్లనే ఈ విషాద ఘటన చోటుచేసుకున్నదా? అని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై బాధితుల మాటల్ని తోసిపుచ్చుతూ.. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘పహల్గాంలో ఉగ్రవాదులు మతం గురించి అడిగి కాల్పులు జరిపారన్నది నిజం కాదు. పహల్గాం బాధితురాలు (మంజునాథ భార్య పల్లవి) తలకాయలేని మాటలు మాట్లాడింది. ఘటన తర్వాత మెదడుపై ఆమె నియంత్రణ కోల్పోయింది’ అని అన్నారు. ‘కార్గిల్ అయినా, పుల్వామా అయినా..ఇది పూర్తిగా భద్రతాపరమైన వైఫల్యం. ఘటనలో తన భర్తను కోల్పోయిన పల్లవి, మతితప్పి చెప్పిన మాటలు అవి. ఒకవేళ ఆమె మాట్లాడిందే నిజమైతే, ముస్లింలను ఉగ్రవాదులు ఎందుకు చంపారని ప్రశ్నిస్తున్నా?’ అని అన్నారు. కులం, మతం అడిగి కాల్పులు జరపటం సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు.