Vaishno Devi | పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కత్రా శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. సాధారణ సమయాల్లో దేశం నలుమూలల నుంచి సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. ప్రస్తుతం భద్రతాపై భయం కారణంగా భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 18,600 మంది మాత్రమే దర్శనం కోసం బయలుదేరి వెళ్లారు. మిగతా రోజుల్లో అయితే, ప్రతిరోజూ 40వేల మంది భక్తులు వచ్చేవారు. కాత్రాలోని హోటల్ నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంట్లు, స్థానిక దుకాణాదారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజుల్లోనే వాహనాల బుకింగ్ 30-40శాతం తగ్గిందని పేర్కొన్నారు. కాత్రా రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాలు గతంలో మాదిరిగా రద్దిగా లేకుండా పర్యాటకులు లేకపోవడంతో బోసిపోతున్నాయి. హోటల్స్, లాడ్జీలకు సైతం బుకింగ్స్ రావడం లేదు. వారాంతాల్లో మాత్రం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వస్తున్నా.. వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటున్నది. కాత్రా నుంచి భవన్ వరకు మొత్తం మార్గంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీఆర్పీఎఫ్, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రయాణికుల స్క్రీనింగ్, తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు, అధికారులు భక్తుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నది. భక్తులు ఎలాంటి భయం లేకుండా దర్శనాలు చేసుకోవచ్చని పేర్కొంది. మరో వైపు స్థానిక వ్యాపారులు సైతం భక్తులు భయపడవద్దని, అమ్మవారి ఆస్థానానికి వచ్చి ఆశీస్సులు పొందాలని పర్యాటకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడం స్థానిక వ్యాపారంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. హోటల్స్, టాక్సీ సేవలు, ఆటోలు, రెస్టారెంట్లు, దుకాణాల్లో తక్కువ మంది కస్టమర్లు ఉండడంతో వ్యాపారులు నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి సాధారణంగా ఉంటుందని, భక్తుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని వ్యాపారులు ఆశిస్తున్నారు. వైష్ణో దేవి ప్రతి సమస్య నుంచి తమను గట్టెక్కిస్తుందని.. భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.