Omar Abdullah : పహల్గాం (Pahalgam) లో అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటన చేశారు. అయితే ఆ 26 మంది ప్రాణాలను అడ్డంపెట్టుకొని తాను రాష్ట్రహోదాను డిమాండ్ చేయబోనని ఆయన హామీ ఇచ్చారు. జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు ఆ డిమాండ్ సరికాదని, మరేదైనా రోజు ఆ డిమాండ్ లేవనెత్తుతానని చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం. కానీ బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పని చేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి’ అని అన్నారు.
పహల్గాం దాడి తర్వాత తాపే ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రహోదా కోసం డిమాండ్ చేయాలని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదని చెప్పారు. గతంలో రాష్ట్రహోదా అడిగామని, భవిష్యత్తులో కూడా అడుగుతామని అన్నారు. కానీ, ఇప్పుడు 26 మంది ఆమాయకులు చనిపోయారని, ఇలాంటి సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రజలు తమకు మద్దతిస్తే తీవ్రవాదం, ఉగ్రవాదం అంతమవుతాయని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇది అందుకు ఆరంభమని చెప్పారు. ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదని అన్నారు. తాము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలమని, కానీ, తమకు ప్రజల మద్దతు అవసరమనిని అబ్దుల్లా అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా తాను వారిని కాపాడలేకపోయానని అన్నారు.
కాగా ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదతీరుతున్న 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఒక్కొక్కరిని మతం అడిగి మరీ ఈ దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు.