బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ సాయం చేస్తుందా? సోమవారం పార్లమెంట్ సాక్షిగా జరిగిన నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో చర్చ నిర్వహించాలంటూ కేంద్రంలోని మోదీ సర్కారుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు గత కొన్నిరోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే దీనిపై ఉభయ సభల్లో పెద్దయెత్తున దుమారం రేగింది. అయినప్పటికీ, ఎన్డీయే ప్రభుత్వం దీనిపై ఏమాత్రం స్పందించలేదు. దీంతో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతీరోజూ ఆందోళనలు ఉద్ధృతం చేశాయి. సర్వత్రా ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం చర్చిస్తామని బీఏసీ సమావేశంలో కేంద్రం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చింది.
అయితే, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి లోక్‌సభలో సోమవారం ఉదయం చర్చ జరగాల్సిన తరుణంలో అనూహ్యంగా బీహార్ ఓటరు జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకొచ్చింది. దానిపై చర్చకు పట్టుబట్టింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. వాయిదా పడిన ఈ రెండు గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాలు పహల్గాం దాడికి కారణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడిన రక్షణమంత్రి రాజ్‌నాథ్.. తాను ప్రిపేరయ్యింది వచ్చి ప్రసంగించారు. మొత్తంగా గత కొన్నిరోజులుగా విపక్షాలు పట్టుబట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ విజయవంతంగా పక్కదారిపట్టినట్లయింది. ప్రభుత్వానికి అనుకూలంగా సభ రెండు గంటలపాటు వాయిదా పడటానికి కాంగ్రెస్ ఈ డ్రామా నడిపిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భారత సైన్యం సోమవారం మట్టుబెట్టింది. భద్రతాదళాలు ఎంతో చాకచక్యంగా జరిపిన ఈ కాల్పుల్లో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్, లష్కరే తాయిబా టాప్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ మూసాఫౌజీ, పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌తో పాటు మరో ఉగ్రవాది అబూ హామ్జా హతమయ్యాడు. ఈ మేరకు ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో వెల్లడించింది. ఈ మేరకు సైన్యం ధ్రువీకరించినట్టు తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెలరోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం గడిచిన 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయి. ఈ క్రమంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం పసిగట్టింది. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని స్థానిక ప్రజలు సైన్యానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం సోమవారం ఉదయం నిర్ణీత ప్రాంతానికి చేరుకొన్నాయి.
సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
సైన్యం ఎన్కౌంటర్ జరిపిన ప్రదేశం జబర్వన్-మహదేవ్ పర్వతాల మధ్య ఉన్నది. అందుకే ఈ ఆపరేషన్‌కు ఆ పర్వతాల పేరు కలిసి వచ్చేలా.. ‘ఆపరేషన్ మహదేవ్’ అని నామకరణం చేశారు.
కాల్పుల్లో హతమైన సులేమాన్ లష్కరే తాయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్రదాడికి ఇతనే మాస్టర్ మైండ్‌గా పనిచేశాడు. ఇతని తలపై రూ. 20 లక్షల రివార్డు ఉన్నది. నిరుడు శ్రీనగర్-సోన్మార్గ్ హైవే మీద జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురి ప్రాణాలు పోవడానికి కూడా సులేమానే కారణమని అధికారులు పేర్కొన్నారు. సులేమాన్ గతంలో పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసినట్టు సమాచారం.