న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, ఈ దాడి సూత్రధారి పాకిస్థాన్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని ఆ పార్టీ ఆరోపించింది. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం(CWC Resolution) చేసింది. ఆ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రదాడి హేయమైన చర్యగా అభివర్ణించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం చెబుతున్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొన్నది.
ఉగ్రదాడి ఓ పిరికిపంద చర్య అని, ఈ దాడికి సూత్రధారి పాకిస్థాన్ అని ఆ పార్టీ తన తీర్మానంలో పేర్కొన్నది. హిందువులను కావాలనే టార్గెట్ చేసి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసినట్లు తీర్మానంలో ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన ఘటన ఇది అని, ఈ సమయంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పార్టీ చెప్పింది. సీమాంతర ఉగ్రవాదాన్ని యుక్తితో ఐక్యంగా ఎదుర్కోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని చదివి వినిపించారు. సీనియర్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. పర్యాటకుల్ని కాపాడే ప్రయత్నంలో స్థానిక పోనీవాలా ప్రాణాలు కోల్పోయాడు. అతనికి సీడబ్ల్యూసీ నివాళి అర్పించింది. అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు.. పెహల్గామ్ దాడిని ఖండించాయని తీర్మానంలో గుర్తు చేశారు. ప్రస్తుత విషాద పరిస్థితి బీజేపీ విద్వేషానికి వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సెక్యూర్టీ, ఇంటెలిజెన్స్ వైఫలం గురించి చెప్పాలని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
ఉగ్రదాడిని ఖండిస్తూ ఏప్రిల్ 25వ తేదీన దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ ఉంటుందని వేణుగోపాల్ తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
𝗥𝗘𝗦𝗢𝗟𝗨𝗧𝗜𝗢𝗡 𝗔𝗗𝗢𝗣𝗧𝗘𝗗 𝗕𝗬 𝗖𝗢𝗡𝗚𝗥𝗘𝗦𝗦 𝗪𝗢𝗥𝗞𝗜𝗡𝗚 𝗖𝗢𝗠𝗠𝗜𝗧𝗧𝗘𝗘 – 𝗗𝗘𝗟𝗛𝗜, 𝗔𝗣𝗥𝗜𝗟 𝟮𝟰𝘁𝗵, 𝟮𝟬𝟮𝟱 pic.twitter.com/dsRuP9LLyz
— Congress (@INCIndia) April 24, 2025