Pahalgam Attack | పహల్గాం తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలోనే రష్యా నుంచి భారత్ ఇగ్లా-ఎస్ మిస్సైల్‌ని దిగుమతి చేసుకున్నది. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు భారత్ ఈ స్మాల్రేంజ్ మిస్సైల్‌ను దిగుమతి చేసుకుంది. దాంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. సైన్యానికి ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్‌ని ఉపయోగించుకొని వాటిని కొనుగోలు చేశారు.
వాస్తవానికి ఈ మిస్సైల్స్ కొద్దిరోజుల కిందటే భారత్‌కు చేరుకోగా.. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిద్దులకు తరలిస్తున్నారు. ఈ మిస్సైల్స్ ఫైటర్ జెట్స్, ఛాపర్స్, డోన్స్ని కూల్చొచ్చు. దాదాపు రూ.260 కోట్ల వ్యయంతో సైన్యం ఈ మిస్సైల్స్‌ని కొనుగోలు చేసింది. ఈ మిస్సైల్ పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల్లో వాడేందుకు అనువుగా ఉండనున్నాయి. ఇవి ఇప్పటికే వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి. ఫాస్ట్‌ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఇటీవల కాలంలో ఆయుధాల విడిభాగాలు సైతం దిగుమతి చేసుకుంటున్నారు. దళాలను యుద్ధ సన్నద్ధతగా ఉంచేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా 48 లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ క్షిపణుల కోసం సైన్యం టెండర్ విడుదల చేసింది. వీటిని ఫాస్ట్‌ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కిందే కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు తర్వాతి తరం ఇగ్లాలపై సైతం రక్షణశాఖ దృష్టి సారించింది.
వీటికి లేజర్‌బీమ్ రైడింగ్ సామర్థ్యం ఉండడం విశేషం. 1990 నుంచి ఇగ్లా మిస్సైల్స్‌ని సైన్యం వినియోగిస్తున్నది. దేశీయంగా ఉన్న సంస్థలు వీటిల్లో మార్పుతో ఇగ్లా-ఎస్ వెర్షన్ రెడీ చేశాయి. పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు, యూఏవీలు వినియోగిస్తున్న నేపథ్యంలో.. ఇగ్లా-ఎస్ మిస్సైల్ అవసరం భారత్‌కు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్‌కి చెందిన మార్క్-1ని సైన్యం మోహరించనున్నిది. ఇది ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి డ్రోన్స్‌ని అడ్డుకునే సామర్థ్యం ఉంది. ఈ వ్యవస్థలో డ్రోన్లను కూల్చే లేజర్ టెక్నాలజీ ఉంది. ఇటీవల జమ్మూలో ఈ వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్ సైన్యం డ్రోన్‌ను ఆర్మీ వైమానిక రక్షణ విభాగం కూల్చివేసింది.