Asaduddin Owaisi : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. దాంతో పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని MIM పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష మహాఘట్బంధన్లో చేరడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఎంఐఎ నిర్ణయించింది.
ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఐదురెట్లు ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగుతున్నామని ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ, మహాఘట్బంధన్ కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మా సత్తాను ప్రత్యర్థులకు చూపిస్తామని, మా బలాన్ని తక్కువ అంచనా వేయలేరు” అని ఆయన అన్నారు.
పొత్తు కోసం తాను ఆర్జేడీ అధినేతలు లాలూప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లకు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అఖ్తరుల్ ఇమాన్ తెలిపారు. దాంతో 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని అన్నారు. కొన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చిస్తున్నామని, మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
కాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏకంగా ఐదు స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరడంతో ప్రస్తుతం అఖ్తరుల్ ఇమాన్ మాత్రమే పార్టీ ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నారు. బీహార్‌లో 17 శాతానికి పైగా ఉన్న ముస్లిం జనాభానే లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇటీవల పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సీమాంచల్ ప్రాంతంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆయా స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎంఐఎం పోటీతో సెక్యులర్ ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా తమ పార్టీ ఏ కూటమికి ‘బీ-టీమ్’ కాదని ఎంఐఎం నేతలు స్పష్టం చేస్తున్నారు.