భోపాల్: ‘ఛీ నా తలపై రివార్డు కేవలం ఒక్క రూపాయేనా? నా విలువ అంతేనా?’ అనుకుంటూ తీవ్ర అవమాన భారంతో ఒక లిక్కర్ మాఫియా సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు. దీంతో తమ వ్యూహం భలే వర్కవుట్ అయ్యిందనుకుంటూ మధ్యప్రదేశ్ పోలీసులు సంబురపడుతున్నారు. నర్సింగ్పూర్ జిల్లా పోలీసులు చాలారోజుల నుంచి తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మాఫియా సభ్యుడు ధరణ్రాజ్ లోదీని పట్టుకుని అప్పగిస్తే రూ.1 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
చట్టం ముందు అతని విలువ పూచికపుల్లతో సమానం అన్న సందేశాన్ని పరోక్షంగా ఇచ్చారు. దీంతో ఆ జిల్లా అంతటా అతని గురించే చర్చించుకోవడం ప్రారంభించారు. దీన్ని ధరణ్రాజ్ తీవ్ర అవమానంగా భావించాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయి పరువు కొంతైనా దక్కిందని ఊపిరి పీల్చుకున్నాడు.