లక్నో, జూలై 14: అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికార బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈ సారి 33 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం లక్నోలో బీజేపీ యూపీ వర్కింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. సీఎం యోగి మాట్లాడుతూ, ‘ప్రధాని మోదీ నాయకత్వంలో, యూపీలో ప్రతిపక్షంపై నిరంతరం ఒత్తిడి పెంచాం. దీంతో 2014, 2017, 2019 ఎన్నికల్లో విజయం సాధించాం. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి. ఇది మన అతి విశ్వాసం వల్లే జరిగింది. మన అంచనాల్ని తలకిందులు చేసింది. ఓటమితో నీరసపడిన ప్రతిపక్షం.. ఇప్పుడు గెలుపును అందుకొని పుంజుకుంది’ అని అన్నారు. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాభావాన్ని పొందింది.