న్యూఢిల్లీ: తన భార్య అనితా సింగ్ ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తన భార్య పేరు తొలగించేందుకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా ప్రయత్నిస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. పూర్వాంచల్ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అంశాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా, పూర్వాంచల్ సోదరులను ‘రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు’ అని వ్యవహరించినట్లు ఆయన విమర్శించారు.
కాగా, పూర్వాంచల్ ప్రజలను బంగ్లాదేశీయులుగా బీజేపీ నేతలు పరిగణిస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. 30, 40 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తూ దేశ రాజధానిని మెరుగుపరచడానికి వారు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. అయితే బీజేపీ వారిని బంగ్లాదేశీయులుగా పిలిచి వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తినందుకు ఆ పార్టీ ప్రతీకారం తీర్చుకుంటున్నదని సంజయ్ సింగ్ ఆరోపించారు. అందుకే ఓటర్ల జాబితా నుంచి తన భార్య పేరును తొలగించాలని ఈసీకి దరఖాస్తు చేశారని విమర్శించారు. ‘నేను వారిపై పరువునష్టం దావా వేస్తా. నన్ను, నా భార్యను అవమానించినందుకు అమిత్ మాల్వియా, మనోజ్ తివారీ కోర్టుకు హాజరుకావాలి. దీనిపై సమాధానం చెప్పాలి’ అని మీడియాతో అన్నారు.