భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. (AAP’s Office Locked) అయితే తమ నిజాయితీకి ఇది నిదర్శమని ఆప్ తెలిపింది. నిధులు లేకపోవడంతో అద్దె చెల్లించలేదని పేర్కొంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆప్ కార్యాలయానికి మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న ఆ పార్టీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు.
కాగా, మధ్యప్రదేశ్ ఆప్ జాయింట్ సెక్రటరీ రమాకాంత్ పటేల్ దీనిపై స్పందించారు. స్థానిక నిధులతో పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన అన్నారు. ఆఫీస్ అద్దె మొత్తం ఎంత, ఎన్ని నెలలు చెల్లించాలో అన్న వివరాలు తనకు తెలియవని చెప్పారు. ‘మేం నిజాయితీగా పనిచేసినప్పుడే ఇలా జరుగుతుంది. ప్రస్తుతం మా పార్టీ వద్ద నిధులు లేవు. కాబట్టి మేం అద్దె చెల్లించలేకపోయాం. మేం నిజాయితీపరులం. పరిస్థితులు మెరుగుపడతాయి’ అని అన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రతినిధి నరేంద్ర సలుజా దీనిపై స్పందించారు. ‘ఎంపీలోని ఆప్ కార్యాలయానికి లాక్ పడింది. ఆ తర్వాత కాంగ్రెస్‌దే’ అని ఎక్స్‌లో విమర్శించారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితమైంది. మొత్తం70 స్థానాలకుగాను 48 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.