న్యూఢిల్లీ: డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది. (Man Stabs Daughter) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నజాఫ్గఢ్ ప్రాంతానికి చెందిన దంపతులైన అబాస్ అలీ, సుఫియా మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఆగ్రహించిన అబాస్ తన భార్య సుఫియా తలపై కత్తితో పొడిచాడు. కుమార్తె అయిన 22 ఏళ్ల రష్మీనా ఖాతూన్ తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. దీంతో కుమార్తె తలపైనా కత్తితో తండ్రి పొడిచాడు. ఈ నేపథ్యంలో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన యువతి తల్లికి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆ దంపతుల రెండో కుమార్తె అయిన 13 ఏళ్ల బాలిక పొరుగువారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులకు జరిగిన సంగతి చెప్పింది. తన అక్కను కత్తితో పొడిచి తండ్రి చంపినట్లు తెలిపింది. దీంతో కుమార్తెను హత్య చేసిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అబాస్ అలీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.