భువనేశ్వర్: ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగిరింది. సుమారు అరగంట పాటు అక్కడ తిరిగింది. దీంతో ఈ సంఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Jagannath Temple) ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో పూరీలోని జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగిరింది. దానికి అమర్చిన కెమెరాలో ఆలయాన్ని చిత్రీకరించింది.
కాగా, నో ఫ్లైయింగ్ జోన్ ప్రాంతమైన జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగురడం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ఆందోళనకు దారి తీసింది. న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ సంఘటనపై స్పందించారు. జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగురవేయడం చట్టవిరుద్ధమని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వాచ్టవర్ల వద్ద 24 గంటలపాటు పోలీస్ సిబ్బందిని మోహరించే చర్యలు చేపడతామని అన్నారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పూరీ ఎస్పీ వెల్లడించారు. ఎవరో యూట్యూబర్ ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.