జైపూర్: వ్యర్థాలు సేకరించే వృద్ధుడ్ని ఆకతాయిలు వేధించారు. (Elderly Waste Collector) అతడి వీడియోలు తీసి మీమ్స్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో ఆ వృద్ధుడు పాపురల్ అయ్యాడు. అయితే వైరల్ అయిన వీడియోలపై మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. లోహావత్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇతర వ్యర్థాలను సేకరించి వాటిని అమ్మి జీవించేవాడు. మూడు చక్రాల బండి ద్వారా వ్యర్థాలు సేకరించే ఆ వృద్ధుడు గ్రామంలో అందరికీ తెలిసిన వ్యక్తి. కొందరు ఆయనను ‘బాబాజీ’ అని పిలుస్తారు.
కాగా, ఆ గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రతాప్ సింగ్‌ను ఆటపట్టించేవారు. ఆ వృద్ధుడు వ్యర్థాలు సేకరించడాన్ని ఎగతాళి చేసేవారు. అయితే తన వెంట పడేవారిని ‘చెత్తను కొంటారా?’ అని ఆయన ప్రశ్నించేవాడు. దీనిని వీడియో రికార్డ్ చేసిన ఆకతాయిలు మీమ్స్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ప్రతాప్ సింగ్ కూడా అంతగా జనం నుంచి గుర్తింపు పొందాడు. అయితే దీని కారణంగా మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైవే సమీపంలోని చెట్టుకు వేలాడిన అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.