ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. ఎన్నికల్లో ‘గడియారం’ గుర్తు వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వివాదం ఇంకా కోర్టు పరిశీలనలో ఉన్నట్లుగా 36 గంటల్లోగా డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. అజిత్ పవార్ వర్గానికి గడియారం గుర్తును ఎన్నికల కమిషన్ (ఈసీ) కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అజిత్ పవార్ వర్గం ఉల్లంఘించిందని, వివాదంపై స్పష్టత ఇవ్వకుండా గడియారం గుర్తు వినియోగాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని బుధవారం సుప్రీంకోర్టులో మళ్లీ వాదించింది.
కాగా, న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విన్నది. అజిత్ పవార్ వర్గం తమ ఆదేశాలను పాటించలేదని బెంచ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన వర్గానికి డెడ్లైన్ విధించింది. ‘గడియారం’ గుర్తు వివాదం ఇంకా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందంటూ 36 గంటల్లోగా డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ‘మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసులు జారీ చేసి కోర్టుకు చూపించాలని పేర్కొంది. ‘గడియారం’ గుర్తును అజిత్ పవార్ వర్గం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేసింది. అయితే నవంబర్ 20న ఒకే దశలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.