HIV Positive | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీరట్ జిల్లాలో గల ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో గత 16 నెలల్లో 81 మంది గర్భిణి స్త్రీల (Pregnant Womens)కు హెచ్ఐవీ పాజిటివ్ (HIV Positive)గా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ప్రకటించారు. మీరట్ (Meerut) లోని లాల లజపత్ రాయ్ మెడికల్ కాలేజ్ (Lala Lajpat Rai Medical College)లోని యాంటీ రెట్రోవైరల్ థెరపీ (Anti-Retroviral Therapy) సెంటర్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణి స్త్రీలకు హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. సాధారణంగా ప్రసవం కోసం వచ్చిన గర్భిణి స్త్రీల రక్తనమూనాలను సేకరిస్తుంటారు. ఇలా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణిల రక్తనమూనాలను తీసుకొని పరీక్షించగా ఈ మొత్తం 81 మందికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఆసుపత్రిలోని ఏఆర్ టీ (ART) సెంటర్ లో 2022-23 సంవత్సరంలో 33 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది జులై వరకూ 13 కొత్త కేసులు వచ్చాయి. అంతకుముందు 35 మంది వైరస్ బారిన పడినట్లు గుర్తించారు.
ప్రస్తుతం బాధిత గర్భిణి స్త్రీలంతా మెడికల్ కాలేజీలోని ఏఆర్ టీ సెంటర్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే, ఆ గర్భిణులకు ప్రసవించిన శిశువులకు మాత్రం 18 నెలలు నిండిన తర్వాతే హెచ్ఐవీ పరీక్షలు చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. గర్భిణులు హెచ్ఐవీ బారిన ఎలా పడుతున్నారన్న కారణాలు తెలుసుకునేందుకు ఓ బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు.
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు.. అమర్ నాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు
Samantha | నేనూ డబ్బులే సంపాదించాను.. రాళ్లు కాదు..! సమంత సెటైర్
Influencer | ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనతో రణరంగంగా న్యూయార్క్.. ఇంతకీ ఏమైందంటే..?