భోపాల్: బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం అధ్వాన్న స్థితికి అద్దం పడుతున్నది. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎం రైజ్ స్కూల్లో ప్రవేశాల కోసం విపరీతంగా డిమాండ్ ఉంది. రాజ్య శిక్ష కేంద్ర విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో 5,500 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి అయినా చేరలేదు. ఒకరు లేదా ఇద్దరు చేరిన పాఠశాలలు సుమారు 25,000 ఉన్నాయి. 10 మంది విద్యార్థుల వరకు చేరిన పాఠశాలల సంఖ్య 11,345 కాగా, దాదాపు 23 వేల బడుల్లో ముగ్గురు నుంచి ఐదుగురి వరకు చేరారు. తాగునీరు వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల సర్కారు బడులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.