గౌహతి: బాల్య వివాహాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. (Child Marriage) రాత్రి వేళ ప్రత్యేక డ్రెవ్ చేపట్టారు. 400 మందికిపైగా అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో కేసులు నమోదు చేస్తున్నారు. మూడో విడతలో భాగంగా 335 కేసులు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి వేళ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ కేసులకు సంబంధించి 416 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని ఆదివారం కోర్టులో ప్రవేశపెడతామని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ సాంఘిక దురాచారాన్ని అంతం చేసేందుకు సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
కాగా, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం 2023లో రెండు దశల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన తొలి దశ డ్రైవ్లో 4,515 కేసులు నమోదు చేసిన పోలీసులు 3,483 మందిని అరెస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన రెండో దశ డ్రైవ్లో 710 కేసులు నమోదు చేసి 915 మందిని అరెస్టు చేశారు. తాజాగా మూడో దశ డ్రైవ్లో 335 కేసులు నమోదు చేసిన పోలీసులు 416 మందిని అరెస్ట్ చేశారు.