జైపూర్: కలుషిత నీరు తాగి 35 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నీట్ శిక్షణ పొందుతున్న ఒక యువకుడు కామెర్లతో మరణించాడు. పోటీ పరీక్షల శిక్షణకు పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. దేశంలోని నలు మూలలకు చెందిన యువతీ,యువకులు జవహర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ అక్కడి హాస్టళ్లలో ఉంటున్నారు. అయితే కలుషిత తాగు నీటి వల్ల 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హెపటైటిస్‌తో చాలా మంది బాధపడుతున్నారు. నగరంలోని మూడు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వీరు చికిత్స పొందుతున్నారు. నీట్ కోసం శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల వైభవ్ రాయ్ చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా, ఈ సంఘటనతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కేసులు 11, హెపటైటిస్ ఈ కేసు ఒకటి ఉన్నాయన్నారు. దీంతో కోటాలో హెపటైటిస్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో స్థానిక కోచింగ్ సెంటర్లు, హాస్టల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించినట్లు కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. వాటర్ ట్యాంక్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భూగర్భ నీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు ఆర్వో వాటర్ ఫిల్టర్లలో యూవీ ల్యాంప్‌ను అమర్చాలని సూచించినట్లు వెల్లడించారు.