న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కరోనా బెంబేలిస్తున్నది. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెయ్యి మందికిపైగా వైద్యులు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 290 మంది వైద్యులు కొవిడ్ బారినపడ్డారు. గత రెండు మూడురోజుల్లోనే వైద్యులకు పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఆరోగ్య సిబ్బందితో సహా 120 మంది వైరస్ బారినపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 50 మంది వైద్యులు, 26 మంది సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 38 మంది, 45 మంది ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకింది. మరో 20 మంది వైద్యులు హిందూరావు ఆసుపత్రి నుంచి, లోక్‌నాయక్ ఆసుపత్రి నుంచి మరో ఏడుగురికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది.
పంజాబ్‌లోని చండీగఢ్‌లో సిబ్బందితో సహా 196 మంది రెండు రోజుల్లోనే వైరస్ సోకింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఇప్పటి వరకు 180 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు.. బిహార్‌లోని పాట్నాలో 200 మంది వైద్యులు, విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో వైద్యులు, నర్సులు 70 మందికిపైగా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. యూపీలోని లక్నో మేదాంతలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాధి సోకింది.