(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : 30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒరాకిల్ తీసుకొన్న నిర్ణయం టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. భారత్‌లోనే 12 వేల మంది ఉద్యోగులపై వేటు పడటం ఆందోళన కలిగిస్తున్నది. టెక్ రంగంలో ఈ కోతలు ఒరాకిల్‌కే పరిమితం కాబోవని, రాబోయే రోజుల్లో పలు సంస్థలు లేఆఫ్ బాటపట్టే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ వైపు పలు కంపెనీలు దృష్టిసారించడంతో సంప్రదాయ కోడింగ్ జాబ్స్ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నట్టు ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేఆఫ్‌లు పెరుగుతున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్) కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యమని సలహానిస్తున్నారు. మొత్తంగా ఏఐ సెగ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మరిన్ని గడ్డు పరిస్థితులను తీసుకురావొచ్చని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగుల వేతనాల కోసం అత్యధిక నిధులను వెచ్చించడానికి బదులు ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలపై నిధులను ఖర్చు చేయడానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒరాకిల్ నిర్ణయం ఇందులో భాగమే. ఇది ఇక్కడితో ఆగిపోదు. మరిన్ని కంపెనీలు ఈ దారిని అనుసరించవచ్చు.
మాస్ లేఆఫ్ నిర్ణయాన్ని ఒరాకిల్ ఎలాగైతే తీసుకొందో సాస్ కంపెనీలు కూడా దాన్ని పాటించవచ్చు. ఏఐ నైపుణ్యాలను మెరుగుపర్చుకొంటే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి.