న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సవరించిన(Voter Roll Revision) విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులోనూ కేసు విచారణ కొనసాగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో.. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్షాలు లేఖ రాశాయి. అనేక మంది విపక్ష ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతోందని, కానీ ఇప్పటి వరకు ఓటర్ల జాబితా అంశంపై చర్చించేందుకు తేదీని ప్రకటించలేదని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ఓటర్ల జాబితా సవరణ వల్ల.. ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రత్యేక చర్చ చేపట్టడం వల్ల ఆ అంశంపై సభ్యులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పారదర్శకత, బాధ్యత అవసరమన్నారు.
విపక్ష ఎంపీలు లేఖ రాసిన నేపథ్యంలో.. స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. మరో వైపు విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ప్రజాస్వామ్యంపై దాడి అని మల్లిఖార్జున్ పేర్కొన్నారు. బలహీన వర్గాల ఓటర్ల హక్కును రక్షిస్తామన్నారు.