న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించిన సవరణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వేతనజీవులను శిక్షిస్తున్నదని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్ క్రూరమైనవని ఆరోపించారు. తాము ఆదా చేసుకున్న సొమ్మును కోరుకున్నందుకు పింఛనుదారులు, ఉద్యోగాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం శిక్షిస్తున్నదన్నారు.
కొత్త ఈపీఎఫ్ఓ నిర్ణయాల ప్రకారం, నిరుద్యోగిగా 12 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చునని, గతంలో ఇది రెండు నెలలు ఉండేదని తెలిపారు. పింఛనును విత్‌డ్రా చేసుకోవడానికి గతంలో రెండు నెలలు వ్యవధి సరిపోయేదని, తాజా సవరణల ప్రకారం ఈ గడువు 36 నెలలకు పెంచారని తెలిపారు. ‘మీ సొంత ఈపీఎఫ్‌లో 25% శాశ్వతంగా లాక్ అయిపోతుంద’న్నారు.
టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్ దిగ్భ్రాంతికరం, హాస్యాస్పదమన్నారు. ఉద్యోగుల సొంత సొమ్మును బహిరంగంగా దొంగిలించడమేనని తెలిపారు. గతంలో ఉద్యోగాన్ని కోల్పోయినవారు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను రెండు నెలల తర్వాత విత్‌డ్రా చేసుకోగలిగేవారన్నారు. ఆ కనిష్ట వ్యవధిని ఇప్పుడు ఒక సంవత్సరానికి పొడిగించారని చెప్పారు.
ఈపీఎఫ్ పెన్షన్ కాంపొనెంట్‌ను నిరుద్యోగిగా 36 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలవుతుందన్నారు, ఇది గతంలో రెండు నెలలేనని పేర్కొన్నారు. ‘మరింత దయనీయమైనది ఏమిటంటే, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 25 శాతం విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు, మీ కెరీర్ మొత్తం, మీరు రిటైర్ అయ్యే వరకు లాక్ అయిపోతుంది’ అని తెలిపారు.