న్యూఢిల్లీ, మార్చి 25 : పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంట్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రను పోషిస్తుంటే మనం మౌన ప్రేక్షకులుగా మిగిలామని కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ విమర్శించారు. దీనిపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చ జరగాలని ఆయన డిమాండు చేశారు. అఖిలపక్ష సమావేశంలో తాము లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలపై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ గౌరవం, ఎల్పీజీ కొరతపై తాము ప్రశ్నలు లేవనెత్తామని, కానీ ప్రభుత్వం నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు, ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న పశ్చిమాసియా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలియచేశారని బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం విపక్షానికి తెలియజేసింది.
పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత్ దళారీ దేశం కాదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొత్తేమీ కాదని, 1981 నుంచి అమెరికా ఆ దేశాన్ని వాడుకుంటూనే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియా పరిస్థితిపై కేంద్రం మౌనంగా ఉందన్న విపక్షాల ఆరోపణను ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము వ్యాఖ్యానిస్తున్నాము, స్పందిస్తున్నామని జైశంకర్ చెప్పారు. ఇరాన్ సుప్రీం నాయకుడు మరణించినపుడు భారత్ సంతాపం ప్రకటించకుండా నైతిక బలహీనతను ప్రదర్శించిందన్న ప్రతిపక్షాల విమర్శకు జవాబిస్తూ ఇరాన్ ఎంబసీ తెరుచుకున్నపుడు విదేశాంగ కార్యదర్శి వెంటనే సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారని జైశంకర్ చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, దేశీయ ఇంధన అవసరాలు తీర్చడం తమకు అత్యంత ప్రధానమని ఆయన తెలిపారు. ఈ విషయాలలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, టీఎంసీ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు.