న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల ప్రతిపాదనను విపక్షాలు బుధవారం వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణలో అసాధ్యమని, కేంద్ర ప్రభుత్వపు చౌకబారు ఎత్తుగడ అని విమర్శించాయి. ‘ఎన్నికలు వచ్చినప్పుడు లేవనెత్తడానికి వారికి(బీజేపీ) ఏ అంశం ఉండదు. అసలైన సమస్యల నుంచి వాళ్లు దృష్టి మళ్లిస్తారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.జమిలి ఎన్నికలు సమాఖ్య వాదాన్ని ధ్వంసం చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన బీజేపీ మరొక చౌకబారు ఎత్తుగడ’ అని టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రియాన్ అన్నారు.
‘సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం..!
కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతింటుంది. ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాలపరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.