న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆయన దేశానికి ఉపన్యాసాలు ఇస్తున్నారని, ‘రాజీపడిన ప్రధాని’ ఇక దేశాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని బోధనలు వైఫల్యానికి నిదర్శనమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ అన్నారు. ప్రజలు త్యాగాలు చేయాలి అని మోదీ చేస్తున్న డిమాండ్లు.. “బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, పెట్రోల్ తక్కువ వాడండి, ఎరువులు, వంటనూనె వినియోగం తగ్గించండి, మెట్రోలో ప్రయాణించండి, ఇంటి నుంచే పని చేయండి..” ఇవి బోధనలు కాదు, వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. 12 ఏండ్లలో మోదీ దేశాన్ని ఇలాంటి స్థితికి తీసుకువచ్చారని, ఏమి కొనాలి, ఏమి కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని ప్రజలకు చెప్పే పరిస్థితి వచ్చిందని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ‘సబ్ చంగా సీ’ ఎందుకన్నరు: ఖర్గే
ఎన్నికలు ముగిశాకే దేశానికి నీతులు చెబుతున్నరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. పశ్చిమ ఆసియా యుద్ధం మొదలైనపుడే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, రూపాయి పతనం, ఇంధనం, ఎరువుల కొరత, ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పు వంటి ప్రతి సంక్షోభాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపిందని ఖర్గే గుర్తు చేశారు. మరి అప్పుడు ప్రధాని ఎన్నికల ప్రచారంలో ఎందుకు మునిగిపోయారు? రోడ్ షోలు ఎందుకు చేశారు? పరిస్థితి అదుపులోనే ఉంది, ‘సబ్ చంగా సీ(అంతా బాగుంది)’ అని ఎందుకు చెప్పారు? అని అన్నారు.
బీజేపీ వాడిన విమానాలు నీటితో నడిచినయా: అఖిలేశ్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే బీజేపీ ఈ సంక్షోభాన్ని అంగీకరించిందని, కానీ దేశానికి ఉన్న ఏకైక సంక్షోభం బీజేపీ అని విమర్శించారు. ఇన్ని ఆంక్షలు విధిస్తే “ఐదు ట్రిలియన్ డాలర్ల జుమ్లా ఎకానమీ” ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ వాడిన వేలాది చార్టర్డ్ విమానాలు నీటితో నడిచాయా అని ఆయన నిలదీశారు.
త్వరలో చమురు ధరల పెంపు: జైరాం రమేశ్
ప్రధాని చేస్తున్న ఈ అనూహ్య విజ్ఞప్తులు చూస్తుంటే అధికారిక గణాంకాలు చెబుతున్న దాని కంటే దేశ ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. కఠినమైన పొదుపు చర్యలు త్వరలోనే రాబోతున్నాయని, వాటిని ప్రజలు అంగీకరించేలా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
చెప్పేటందుకే నీతులు: సంజయ్ సింగ్
“దేశభక్తి పేరుతో మీరు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడడం మానేయాలి. బంగారం కొనకూడదు. వంట నూనె వాడకూడదు. కానీ మోదీగారు మాత్రం తన ర్యాలీలకు లక్షలాది మందిని తరలిస్తారు. విదేశీ పర్యటనలు చేస్తారు. ఇంధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఆయన మనుషులు బంగారం మాత్రమే కాదు, మొత్తం దేశ సంపదను కొల్లగొడతారు” అని ఆప్ నేత సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు.