న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల కుట్రగా అభివర్ణించారు. బీజేపీ పార్టీ కాదని.. అది ‘మోసం’ అని విమర్శించారు. బీహార్లో ‘సర్’ పేరిట ఆడిన ఆట పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రదేశాల్లో సాధ్యం కాదని.. ఇకపై వారి ఆటలను తాము సాగనివ్వమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీహారీల ఇష్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఎన్నికలను హైజాక్ చేశారని, ఈ ఎన్నికలకు అర్థమే లేదని ఆప్ ఆరోపించింది. ‘80 లక్షల ఓట్లు తొలగించిన చోట, 5 లక్షల ఓట్లు నకిలీవైన చోట, ఒక లక్ష ఓట్లు గుర్తు తెలియనివైన చోట ఫలితాలు ఎలా ఉంటాయి’ అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఆశీస్సులతో బీహార్లో ఎన్డీయే గెలిచిందన్నారు. బీహార్లో మహాఘట్బంధన్కు మద్దతుగా నిలిచే వర్గాల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరిగిందని విపక్షాలు ఆరోపించాయి.