శనివారం 23 జనవరి 2021
National - Dec 05, 2020 , 01:56:07

మా రాష్ర్టానికొస్తే జైల్లో వేస్తాం

మా రాష్ర్టానికొస్తే జైల్లో వేస్తాం

  • ఇతర రాష్ర్టాల రైతులను గింజకూడా అమ్మనివ్వం
  • ధాన్యం తెచ్చే ట్రక్కులను కూడా జప్తు చేస్తాం
  • మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటన
  • రైతు చట్టాలపై బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలు
  • ఎక్కడైనా అమ్ముకోవచ్చంటున్న ప్రధాని మోదీ
  • బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం నుంచే వ్యతిరేకత

భోపాల్‌, డిసెంబర్‌ 4: రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చట్టం తెచ్చిన బీజేపీ.. రెండు నెలలు గడువకముందే దానికి గండి కొట్టింది. రైతులు పంటలను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని ఒకవైపు కేంద్రప్రభుత్వం ఊదరగొడుతుండగా.. అదే పార్టీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మాత్రం పక్క రాష్ర్టాల రైతులు ఒక్క గింజ అమ్మటానికి ప్రయత్నించినా జైల్లో పెడుతామని హెచ్చరించింది. తమ రాష్ట్రంలో ఇతర రాష్ర్టాల రైతులు ఉత్పత్తులను అమ్మితే జైలుకు పంపుతామని సాక్షాత్తూ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హెచ్చరించారు. రాష్ట్రంలోని సెహోర్‌లో రైతులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని నేను నిర్ణయించాను. ఇతర రాష్ర్టాల నుంచి రైతులు వచ్చి తమ పంటలను అమ్మటానికి ప్రయత్నిస్తే వారి లారీలను జప్తు చేస్తాం.. రైతులను జైల్లో పెడుతాం’ అని హెచ్చరించారు. 

సొంత చట్టానికే తూట్లు..

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించి నిరవధిక నిరసనోద్యమం చేస్తున్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కనీసం గౌరవం ఇవ్వకుండా.. మోదీ సర్కారు బలప్రయోగంతో వారిని అణచివేయటానికే ప్రయత్నిస్తున్నది. రైతులతో చర్చల్లో కూడా మొండివైఖరి అనుసరిస్తున్నది. కొత్తచట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదని రెండురోజుల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. రైతులు దళారీల బెడద లేకుండా దేశంలో ఎక్కడైనా వ్యవసాయోత్పత్తులను అమ్ముకొనేందుకు తాము మార్గం ఏర్పరిచామని ప్రధాని మోదీ ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో ప్రకటిస్తూనే ఉన్నారు. మరిప్పుడు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఇతర రాష్ర్టాల రైతులు పంటలను అమ్ముకొనే అవకాశం లేకపోతే కేంద్ర చట్టానికి విలువ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పార్టీ.. కేంద్రంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిర్ణయాలు తీసుకోవటంపై మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌ దారిలోనే ఇతర రాష్ర్టాలు కూడా నిర్ణయాలు తీసుకొంటే మోదీ సర్కారు ఏం చేస్తుందని నిలదీస్తున్నారు.   

‘మన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని నేను నిర్ణయించాను. ఇతర రాష్ర్టాల నుంచి రైతులు వచ్చి తమ పంటలను అమ్మటానికి ప్రయత్నిస్తే వారి లారీలను జప్తు చేస్తాం.. రైతులను జైల్లో పెడుతాం’.

-శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 


logo