న్యూఢిల్లీ, జూన్ 15: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. విపక్ష పార్టీల నేతలతో మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి అంశం ఎటూ తేలకపోవడంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాక.. రాష్ట్రపతి అభ్యర్థిపై త్వరలోనే ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నది. కాగా, ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మమత నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం రాష్ట్రపతి ఎన్నికలే ఎజెండాగా కొనసాగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలన్న మమత విజ్ఞప్తిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడానికి తాను ఇష్టపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో సఫలమవుతాయన్న దానిపై నమ్మకంగా లేకపోవడం వల్లే పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పవార్ విముఖంగా ఉండటంతో మరో ఇద్దరి పేర్లను మమత ప్రతిపాదించారు. బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను ఆమె సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనపై విపక్ష పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. అనంతరం సమావేశంలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో మరోసారి భేటీ అవుదామంటూ రెండు గంటల్లోనే సమావేశాన్ని ముగించారు. 20న లేదా 21న పవార్ నేతృత్వంలో ముంబైలో మరో సమావేశం జరుగనున్నట్టు సమాచారం. అయితే, విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకే నిర్ణయించినట్టు ఆయా పార్టీ నేతలు సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు విపక్షాలు జూన్ 21 డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.
బుధవారం జరిగిన భేటీకి ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, జేడీఎస్ నుంచి దేవెగౌడ, కుమారస్వామి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా హాజరయ్యారు. శివసేన, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, ఐయూఎంఎల్, జేఎంఎం పార్టీలు కూడా భేటీకి హాజరైనప్పటికీ, ఆయా పార్టీల అగ్రనాయకులెవ్వరూ సమావేశంలో పాల్గొనలేదు. తమ ప్రతినిధులను మాత్రమే పంపించారు. టీఆర్ఎస్, ఆప్, ఎస్ఏడీ, బీజేడీ తదితర పార్టీలు ఈ మీటింగ్‌కు దూరంగా ఉన్నాయి. సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించడం, ముందస్తు సమాలోచనలు జరుపకుండా ఏకపక్షంగా సమావేశాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నందు వల్లే మమత భేటీకి దూరంగా ఉంటున్నట్టు టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్‌ను ఆహ్వానించినందువల్లే తాము భేటీకి హాజరవ్వడంలేదని ఎస్ఏడీ, ఆప్ వెల్లడించాయి.
విపక్ష నేతలకు రాజ్‌నాథ్ ఫోన్
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, పవార్, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఫోన్లో మాట్లాడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతున్నట్టు విపక్ష నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, వచ్చేవారం బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన ఉండవచ్చని తెలుస్తున్నది. ఇదిలాఉండగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున నిలబెట్టే ఉమ్మడి అభ్యర్థి ఎంపికలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అభ్యర్థి ఖరారులో ఏకాభిప్రాయానికి రావడంలో విపక్షాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తరఫు అభ్యర్థిగా ఇంతవరకూ ఎవరినీ నిర్ణయించలేదని చెప్పారు
తొలి రోజున 11 నామినేషన్లు
రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలిరోజున 11 మంది నామినేషన్లు వేశారు. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 2 చివరితేదీ. జూలై 18న పోలింగ్, 21న ఫలితాలు వెల్లడిస్తారు.