Kanchanjunga Express accident : తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రెండు, మూడు రైలు ప్రమాదాలు చూసిన తర్వాత రైళ్లు ఢీకొనడాన్ని నివారించే డివైజ్ను రూపొందించి ప్రవేశపెట్టామని, ఆపై రైళ్లు ఢీకొనే ఘటనలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. రైల్వేల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియని పరిస్ధితి నెలకొందని, రైల్వే మంత్రిత్వ శాఖలో సమస్యలు చుట్టుముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వేలను మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్ధలాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనకు రైల్వేల గురించి క్షుణ్ణంగా తెలుసని అన్నారు. తన సమయంలోనే మెట్రో రైళ్లు, నూతన రైల్వే స్టేషన్లు వచ్చాయని గుర్తుచేశారు.
తన హయాంలో రైల్వేల అభివృద్ధికి తగినన్ని నిధులు సమకూర్చానని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ను తొలగించారని, రైల్వేలకు సరైన నిధులు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. వందే భారత్ ట్రైన్ల గురించి ప్రచారంతో ఊదరగొట్టడం మినహా రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. రాజధాని ఎక్స్ప్రెస్ తర్వాత అత్యంత వేగవంతమైన రైలు దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. రైల్వే శాఖ పట్ల సరైన శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read More :
Aditya Thackeray | ఈవీఎంలు లేకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదు : ఆదిత్య ఠాక్రే