Joshimath demolitions | ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భూమి కుంగిపోయిన ఘటనలో ప్రభావిత ప్రాంతంలోని హోటళ్లను కూల్చివేసే పనులను అధికారులు మొదలుపెట్టారు. గురువారం సాయంత్రం హోటల్ మలారి ఇన్ని ఎస్డీఆర్ఎఫ్ స్వాధీనం చేసుకున్నది. చుట్టుపక్కల రోడ్లను పోలీసులు మూసివేశారు. నిరసనకారులు రాకుండా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వెనుకకు వంగి ఉన్న ఈ హోటల్ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదంలో ఉన్నది. కాగా, మరో హోటల్ మౌంట్ వ్యూను కూడా త్వరలో కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
శాస్త్రవేత్తలు సూచించిన విధంగా నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ నందు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టి పగుళ్లు ఏర్పడిన ఇళ్లను కూల్చివేసే పనులను నిన్నటి నుంచి ప్రారంభిచారు. పట్టణంలో 4500 ఇండ్లకు గాను ఇప్పటివరకు దాదాపు 700 భవనాలకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇప్పటికే 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. జోషీమఠ్‌లోని భూమి కుంగిపోవడం సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆర్మీ స్థావరంలోని 25 భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. బలగాలను తాత్కాలికంగా ఔలికి తరలించినట్లు చెప్పారు.
కాగా, పరిస్థితులను స్వయంగా సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జోషీమఠ్ చేరుకున్నారు. అక్కడ అధికారులు, నిపుణులతో సమీక్ష జరిపి వారి సూచనల మేరకు పలు భవనాల కూల్చివేత వెంటనే చేపట్టాలని ఆదేశాలిచ్చారు. దాంతో అధికారులు మలారీ ఇన్ను స్వాధీనం చేసుకుని కూల్చివేత పనులు ప్రారంభించారు. మరోవైపు జోషీమఠ్‌కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఆర్కే సింగ్, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొని రోడ్డు, విద్యుత్ సరఫరా, తాగునీరు, పర్యావరణ పరిస్థితిపై చర్చించారు.