Operation Tiger 3.0 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన కొందరు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆపరేషన్ టైగర్ 3.0గా అభివర్ణిస్తున్నారు షిండే వర్గపు నేతలు. తాజాగా షిండే వర్గంలోని శివసేనకు చెందిన మంత్రి గులాబ్రావ్ పాటిల్ దీనిపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆపరేషన్ టైగర్ 3.0 ప్రారంభమైందన్నారు.
దీనిలో భాగంగా ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు త్వరలో డిప్యూటీ సీఎం షిండే వర్గంలో చేరుతారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో విలీనం కావొచ్చు. దీని ప్రకారం 20 మందిలో 14 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరితే విలీనం పూర్తవుతుంది. వారికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇదే జరిగితే ఉద్ధవ్ శివసేనకు భారీ ఎదురుదెబ్బ తప్పదు. ప్రస్తుతం ఉద్ధవ్ శివసేన.. శరద్చంద్ర పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీయే) కూటమిగా ఉన్నాయి. ఈ కూటమికి 60 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇటీవల ఎంవీయే సమావేశం జరిగింది.
అయితే, సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 37 మంది మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. దీంతో వీరంతా షిండే వర్గంలో చేరుతారనే ప్రచారం మొదలైంది. ఇటీవలే ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఇటు ఎంపీలు, అటు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడితే ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అయితే, తామంతా ఐక్యంగా ఉన్నామని, పార్టీలో, కూటమిలో ఎలాంటి విబేధాలు లేవని నేతలు అంటున్నారు.