India Pakistan Tension | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్‌ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్నది. వీరితోపాటు ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. మరోవైపు యుద్ధ సమయంలో కనీస ధర్మం పాటించకుండా ప్రార్థనా మందిరాలపై పాక్ దాడులు చేస్తున్నది. పౌర విమానాలను, విద్యార్థులను రక్షణ కవచాలుగా వాడుకునే దుస్థితికి దిగజారింది. పాక్ చేస్తున్న దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నది.
సరిహద్దు గ్రామాల్లో శకలాలు గుర్తింపు
పంజాబ్‌లోని భటిండా జిల్లా హోషియార్పూర్, తుంగ్వాలి, కామాహి దేవి, బుర్జ్ మహిమ గ్రామాల్లో మిస్సైల్ శకలాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ‘గురువారం అర్ధరాత్రి కొన్ని వస్తువులు మా గ్రామంలో పడి భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో చుట్టుపక్కల ఇండ్ల అద్దాలు, తలుపులు, పశువుల పాకలు ధ్వంసం అయ్యాయి’ అని పేర్కొన్నారు. అవి పడినచోట మూడు అడుగుల లోతుతో గొయ్యి ఏర్పడిందన్నారు. పఠాన్‌కోట్‌లోని ఓ గ్రామం నుంచి మోర్టార్ షెల్ భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కంగ్రా జిల్లాలో పఠాన్‌కోట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కరియాల్ గ్రామంలో బాంబు శకలాల వంటివి లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా కిషన్‌ఘాట్‌లోని ఓ నర్సరీ సమీపంలో బాంబు వంటి వస్తువును గుర్తించినట్టు కొత్వాలి ఎస్‌హెచ్‌వో ప్రేమ్ దాన్ తెలిపారు. ఆర్మీ అధికారులు దానిని నిర్వీర్యం చేశారన్నారు. భారత్ కూల్చివేసిన పాక్ డ్రోన్‌కు చెందినదై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
బారాముల్లా జిల్లాలోని యూరీలో పాక్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన తన ఇంటిని పరిశీలిస్తున్న స్థానికుడు
మూడు జిల్లాల్లో ప్రజల తరలింపు..
జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, బండిపొరా, రాజౌరి జిల్లాల్లోని ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పాక్ సైన్యం జనావాసాలే లక్ష్యంగా షెల్లింగ్‌కు పాల్పడుతుండటంతో కొందరిని బంకర్లలోకి, మరికొందరిని పొరుగు జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 100కు పైగా ఇండ్లు, డజనుకుపైగా వాణిజ్య భవనాలు, పలు ప్రభుత్వ భవనాలు ధ్వంసం అయ్యాయన్నారు.
పూంఛ్‌లో పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వారా పరిసరాలను చూపిస్తున్న యువకులు
మరో గురుద్వారాపై దాడి
పాక్ సైన్యం కనీస ధర్మం మరిచి ప్రార్థనా మందిరాలపైనా పాక్ దాడులు చేస్తున్నది. శుక్రవారం పూంచ్ సమీపంలోని మరో గురుద్వారాపై మోర్టార్ షెల్స్‌తో దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. డేరా సంత్ పురా నాగాలి సాహిబ్ గురుద్వారా ప్రహరీ ధ్వంసం అయ్యిందని, ప్రధాన భవనానికి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బుధవారం పూంచ్ జిల్లాలోని శ్రీ గురుసింగ్ సభా గురుద్వారాపై పాక్ సైన్యం మోర్టర్ షెల్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే.
పంజాబ్‌లోని భటిండా జిల్లాలో ఓ పొలంలో పడిన క్షిపణి శకలం
రక్షణ కవచాలుగా విద్యార్థులు, పౌరవిమానాలు..
పాకిస్థాన్ రక్షణ వలయంలోని రెండో అంచెలో మదరసా విద్యార్థులు ఉంటారని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, ‘మదరసాల్లో చదువుతున్న యువత మన రెండో అంచెలో ఉండే రక్షక దళం. సమయం వచ్చినపుడు వారిని వంద శాతం ఉపయోగించుకుంటాం’ అని చెప్పారు. మరోవైపు.. పాకిస్థాన్ పౌరవిమానాలను సైతం అడ్డుపెట్టుకున్నదని తేలింది. బుధవారం రాత్రి భారత్‌పైకి మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించిన సమయంలో ఫ్లైనాస్ ఏవియేషన్‌కు చెందిన ఎయిర్ బస్ 320 విమానం సరిహద్దుకు సమీపంలో పాక్ గగనతలంలో ప్రయాణించిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ విమానానికి ఎలాంటి నష్టం కలగకుండా పాక్ దాడులను తిప్పికొట్టామని చెప్పారు. వాస్తవానికి యుద్ధసమయాల్లో సరిహద్దు సమీపంలోని ఎయిర్‌పోర్టులను, గగనతలాలను మూసివేస్తుంటారు.
పాక్ ప్రయోగించిన ఓ క్షిపణిని భారత సైన్యం కూల్చడంతో దాని శకలాలు పంజాబ్‌లోని హోషియాపూర్ ప్రాంతంలో పడిన దృశ్యం
భారత్‌పై అసత్య ప్రచారం
పాక్ తన తప్పులను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తన అనుకూల మీడియా, ఇన్ఫ్లూయెన్సర్లు, రాజకీయ నేతల సాయంతో తప్పుడు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నది. భారత్‌కు చెందిన విమానాలను, డ్రోన్లను కూల్చేశామంటూ పాత ఫొటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నదని భారత్ ఆధారాలతో సహా నిరూపించింది.
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు పౌరుల మృతి
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్, కుప్వారా, బారాముల్లా జిల్లాలవైపు గురువారం రాత్రి మొదలు శుక్రవారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. జనావాసాలే లక్ష్యంగా మోర్టార్ షెల్స్ ప్రయోగించిందని స్థానికులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3:50 గంటల నుంచి 4:45 గంటల వరకు పూంచ్, రాజౌరి జిల్లాల్లో భారీ ఎత్తున దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ సమయంలో బ్లాక్ఔట్ ప్రకటించడంతోపాటు అలర్ట్ సైరన్లు మోగించామన్నారు. ఈ దాడులతో ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అనేక ఇండ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు.
Baramulla5
పూంచ్ జిల్లా మెంధర్ సెక్టార్‌లోని లోరాన్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో మహ్మద్ అబ్రార్ అనే పౌరుడు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. యూరీ సెక్టార్‌లోని యూరీ, సియాల్కోట్, బోనియార్, కమాల్కోట్, మోహ్రా, గింకిల్ తదితర ప్రాంతాలపైకి మోర్టార్ షెల్స్‌తో దాడి చేసినట్టు అధికారులు చెప్పారు. మోహ్రా ప్రాంతంలో ఒక కుటుంబం దాడుల నుంచి తప్పించుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కార్‌పై షెల్ పడి పేలిందన్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న నర్గిస్ బేగం అనే మహిళ మరణించినట్టు చెప్పారు. ఆమె కుటుంబానికి చెందిన మరో ఇద్దరు గాయపడ్డట్టు వెల్లడించారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు.