Pakistan Drones | న్యూఢిల్లీ, మే 9: భారత్‌పై దాడికి పాక్ సైన్యం టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించిందని సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. జమ్ములోని లేహ్ నుంచి గుజరాత్‌లోని సర్‌క్రీక్ వరకు 36 కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని సుమారు 400 డ్రోన్లతో పాక్ దాడికి పాల్పడినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు. పౌర విమానాలను కవచంగా మార్చుకొని, వాటి మాటున వైమానిక దాడులకు పాల్పడిందని తెలిపారు. భారత్‌లో కూలిన ఆ డ్రోన్ల శిథిలాలను పరిశీలించినప్పుడు అవి టర్కీలో తయారైన ‘ఆసిస్‌గార్డ్ సోంగర్’ మాడల్ డ్రోన్లని వెల్లడైందని తెలిపారు.
పాక్ సైన్యం గురువారం రాత్రి దేశ పశ్చిమ సరిహద్దు వైపు అనేకమార్లు మన గగనతలాన్ని ఉల్లంఘించిందని వ్యోమికాసింగ్ చెప్పారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులు జరిపిందని తెలిపారు. తొలుత పాక్‌కు చెందిన నిరాయుధ డ్రోన్ భటిండా మిలిటరీ స్టేషన్‌వైపు వచ్చిందని, దానిని గుర్తించిన సైన్యం వెంటనే కూల్చివేసిందని చెప్పారు. ఉభయ దేశాల మధ్య డ్రోన్ల దాడికి అదే ప్రారంభం అని అన్నారు. పాక్ డ్రోన్ల దాడికి భారత్ దీటుగా జవాబు చెప్పిందని అన్నారు. పాక్‌కు చెందిన నాలుగు గగనతల రక్షణ స్థావరాలపైకి సాయుధ డ్రోన్లను ప్రయోగించామని చెప్పారు. తాము ప్రయోగించిన డ్రోన్లలో ఒకటి పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిందని తెలిపారు. పాక్ దుస్సాహసం డ్రోన్లకే పరిమితం కాలేదని అన్నారు. నియత్రణ రేఖ వెంట భారీ ఆయుధాలతో కాల్పులు కొనసాగించిందని చెప్పారు. పాక్ దాడుల్లో మన సైన్యానికి కూడా కొంత నష్టం జరిగిందని, కొందరు గాయపడ్డారని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రార్థనా స్థలాలపై పాక్ దాడి
ప్రార్థనా స్థలాలపై దాడులు చేస్తున్న పాక్ ఆ నిందను భారత సైన్యంపై వేస్తున్నదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిశ్రీ చెప్పారు. ఇది ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే పాక్ దుష్టయత్నమని పేర్కొన్నారు. అ మృత్‌సర్‌లోని ఓ గురుద్వారాపై దాడి జరిపిన పాక్ ఆ నిందను భారత సైన్యంపై వేయడాన్ని ప్రస్తావించారు.
డ్రోన్ దాడులు మేం చేయలేదు: పాక్
భారత్‌లోని అనేక ప్రదేశాలపై తాము దాడులు నిర్వహించినట్లు భారతీయ మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్థాన్ శుక్రవారం ఖండించింది. ఇవన్నీ నిరాధార వార్తలని, నిర్లక్ష్య ప్రచారంలో భాగమని పాక్ ఆరోపించింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతిని మరింత దెబ్బతీస్తాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఓప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తాము భారతీయ డ్రోన్లను అడ్డుకోలేదని, వాటిని తాము కూల్చివేస్తే భారతీయ దళాలకు పాక్ రక్షణ స్థావరాల ఉనికిని చూపించి నట్లవుతుందని వ్యాఖ్యానించారు. గురువారం పాకిస్థా న్ జరిపిన దాడులకు భారత్ దీటుగా సమాధానం ఇవ్వడాన్ని ప్రస్తావిస్త్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ డ్రోన్ల దాడిని తిప్పికొట్టాం.. కూల్చివేశాం: భారత సైన్యం
న్యూఢిలీ, మే 9: పశ్చిమ సరిహద్దుల వెంబడి గురువారం రాత్రి పాకిస్థానీ సాయుధ దళాలు డ్రోన్లు, ఇతర ఆయుధాలతో వరుస దాడులు జరిపిందని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారతసైన్యం శుక్రవారం ప్రకటించింది. జమ్ము కశ్మీరులోని నియంత్రరేఖ వెంబడి పాకిస్థానీ రేంజర్లు అనేక చోట్ల కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎక్స్ వేదికగా భారతీయ సైన్యం వెల్లడించింది. దీంతోపాటు ఓ చిన్న వీడియో క్లిప్‌ను జతచేసిన సైన్యం అన్ని నీచ కుట్రలను దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ము కశ్మీరులోని జమ్ము, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థానీ సేనలు దాడులకు ప్రయత్నించాయని, వాటిని కైనెటిక్, నాన్ కైనెటిక్ సామర్థ్యాలతో నిర్వీర్యం చేశామని గురువారం అర్ధరాత్రి ఒక ప్రకటనలో రక్షణ శాఖ తెలిపింది.